1992 సంవత్సరంలో అయోధ్యలో సమావేశమైన కరసేవకులపై కాల్పులు జరిపేందుకు ఆదేశాలు ఇవ్వనందుకు గర్వపడుతున్నానని భాజపా సీనియర్ నేత, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ వ్యాఖ్యానించారు. కరసేవకులను నియంత్రించడానికి కాల్పులు కాకుండా ఇతర మార్గాలు చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. కాల్పులు జరిగి ఉంటే దేశవ్యాప్తంగా అశాంతి తలెత్తేదని అన్నారు.
"1992లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయోధ్యలో సమావేశమైన కరసేవకులపై కాల్పులు చేయవద్దని ఆదేశించాను. కరసేవకులు ఉన్న సాకేత్ కళాశాల ప్రాంతంలో నాలుగు బెటాలియన్ల కేంద్ర ప్రభుత్వ బలగాలు మోహరించాయని జిల్లా యంత్రాగం నాకు సమాచారం అందించింది. కాల్పులు జరపకుండా వారిని నియంత్రించడానికి ఇతర మార్గాలు అన్వేషించాలని సూచించాను. దేశ నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు కాబట్టి, కాల్పులు జరిగి ఉంటే తీవ్ర స్థాయిలో అలజడి ప్రారంభమయ్యేది. కరసేవకుల్లో ఒక్కరు కూడా మరణించనందుకు గర్వపడుతున్నాను. రాముడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినందుకు కూడా నాకు బాధ లేదు."
-కళ్యాణ్ సింగ్, యూపీ మాజీ సీఎం
ఐదు వందల ఏళ్ల పోరాటానికి ఫలితమే అయోధ్య రామ మందిర నిర్మాణమని పేర్కొన్నారు కళ్యాణ్. భూమి పూజ జరుగుతుండటం చాలా సంతోషం కలిగిస్తోందని చెప్పారు. హిందువులను అవమానించడానికే బాబ్రీ మసీదును నిర్మించారని అన్నారు.