దిల్లీ లోదీ ఎస్టేట్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఓ మద్దతుదారుడు తన నివాసాన్ని వినియోగించుకోవచ్చని ప్రియాంకను అభ్యర్థించాడు.
వారణాసిలోని ఖోజ్వాకు చెందిన పునీత్ మిశ్రా తన రెండంతస్తుల భవనానికి ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేరుతో నేమ్‌ప్లేట్ ఏర్పాటు చేశాడు.
"ప్రియాంకా గాంధీకి అధికార భవనాన్ని ఖాళీ చేయడానికి నెల రోజులు సమయమిచ్చారు. నేను ఆమెకు చాలా పెద్ద అభిమానిని. ప్రియాంకకు ఉన్న మద్దతుదారులలో నేనూ ఒకడిని. అందువల్ల నా ఇంటిని ఆమె కోసం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రియాంక తన సౌలభ్యం ప్రకారం ఈ ఇంటిని వినియోగించుకోవచ్చు. ఆమె వారణాసిలోనే ఉండి ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ ఇంటిని ఆఫీసుతో పాటు నివాసంగానూ ఉపయోగించుకోవచ్చు. ప్రియాంకా గాంధీ కుటుంబసభ్యులందరూ ఉండే విధంగా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి."