దేశానికి యువకులు ఆత్మ వంటి వారని, ఇప్పుడు దేశ ఆత్మపైనే దాడి జరిగిందన్నారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ(జేఎమ్ఐ) ఘటనకు నిరసనగా దిల్లీలోని ఇండియా గేట్ ముందు బైఠాయించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యంగాన్ని నాశనం చేయడానికే.. కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు.
ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు.. ఇండియా గేట్ వద్ద రెండు గంటల పాటు మౌన ప్రదర్శన చేపట్టారు. అనంతరం మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రియాంక. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
'మోదీజీ... నిరుద్యోగం, అత్యాచారాలపై మాట్లాడండి'
"కేంద్రం రాజ్యాంగన్ని దుర్వినియోగం చేస్తోంది. విద్యార్థులపై దాడి చేస్తోంది. ఈ దేశం అందరికోసం. నిన్న(జామియా వర్సిటి ఘటన) దాడికి గురైన విద్యార్థుల కోసం కూడా. దేశానికి ఆత్మ వంటి విద్యార్థులపై దాడి జరిగింది. నిరసన తెలపడం వారి హక్కు. లైబ్రరీలో ఉన్న వారిని కూడా బయటకు లాక్కొచ్చి కొట్టారు. ఇది నిరంకుశత్వం. ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో ఉన్న ప్రతీ ఒక్క వ్యక్తి పోరాడతారు. యూనివర్సిటీలో నిన్న జరిగిన విషయంపై ప్రధాని సమాధానం చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ మందగమనం, మీ(భాజపా) ఎమ్మెల్యే చేసిన అత్యాచారంపై మాట్లాడాలి. కానీ వీటిపై ప్రధాని ఎందుకు మాట్లాడట్లేదు?"-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి.
హింసాత్మక నిరసనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న వాదనను ఆ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ఖండించారు. జామియా వర్సిటీ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆదివారం జామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.