భాజపా ప్రభుత్వంతో ప్రియాంక గాంధీ పోరాటం ముగిసింది. సోన్‌భద్ర బాధితులను కలిసిన ప్రియాంక... వారణాసికి పయనమయ్యారు.
లైవ్: ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక పోరాటం సమాప్తం
14:52 July 20
ముగిసిన పోరాటం
13:54 July 20
'సోన్‌భద్ర బాధితులకు 10 లక్షల సహాయం'
సోన్‌భద్ర బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ప్రియాంక తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీనిచ్చారు.
13:43 July 20
ప్రియాంకకు రాహుల్ మద్దతు...
ప్రియాంక గాంధీకి సోదరుడు రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ప్రియాంకను ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. యూపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆరోపించారు.
13:19 July 20
ప్రియాంకను కలిసిన సోన్‌భద్ర బాధితులు...
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని చునార్ అతిథి గృహం వద్ద 12 మంది సోన్‌భద్ర బాధితుల కుటుంబ సభ్యులు కలిశారు. వారికి ప్రియాంక ధైర్యం చెప్పారు.
12:48 July 20
'ఉత్తరప్రదేశ్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ'
సోన్‌భద్ర ఘటన నేపథ్యంలో ప్రమోద్ తివారీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్‌ను కలిసింది. బాధితులను పరామర్శించి, వారి బాధలు తేలుసుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ప్రమోద్ తివారీ ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొందని విమర్శించారు.
12:35 July 20
నిన్న ప్రియాంక... నేడు కాంగ్రెస్ నేతలు...
సోన్‌భద్ర బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ బృందాన్ని యూపీ పోలీసులు అడ్డుకున్నారు. వారణాసి విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు దీపేందర్ సింగ్ హుడా, ముకుల్ వాస్నిక్, రాజ్ బబ్బర్, రాజీవ్ శుక్లా తదితరులను పోలీసులు అడ్డగించారు.
12:30 July 20
'తప్పులను కప్పిపుచ్చడానికి భాజపా యత్నిస్తోంది'
చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి భాజపా ప్రభుత్వం సెక్షన్ 144ను వినియోగిస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేశారు. అందుకే సోన్‌భద్ర బాధితులను పరామర్శించేందుకు అనుమతినివ్వడం లేదని విమర్శించారు.
12:07 July 20
చునార్ అతిథి గృహం వద్ద పరిస్థితి...
ఉత్తరప్రదేశ్‌లోని చునార్ అతిథి గృహం వద్ద వాతావరణం వేడెక్కింది. ఆ ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు అధికారులు. సోన్‌భద్ర బాధితులను కలవనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని ప్రియాంక ఆరోపించారు. అతిథి గృహంలోనే ధర్నాకు దిగారు.
12:01 July 20
ఏంటీ సోన్‌భద్ర వివాదం?
బుధవారం సోన్‌భద్రలోని ఘోరావల్ వద్ద రెండు వర్గాల మధ్య భూమి విషయమై ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు మరొక వర్గంపై కాల్పులు జరిపారు. ఫలితంగా 10 మంది చనిపోయారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు.
11:56 July 20
కాంగ్రెస్ ఆగ్రహం...
ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా శుక్రవారం పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్, బంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయం ఎదుట హస్తం కార్యకర్తలు ధర్నాకు దిగారు.
ప్రియాంక గాంధీని అడ్డగించడం ద్వారా 10మంది మృతిని యూపీ ప్రభుత్వం కప్పి పుచ్చగలదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
11:46 July 20
ప్రియాంక వద్దకు సోన్‌భద్ర బాధితుల బంధువులు...
సోన్‌భద్ర బాధితులకు చెందిన ఇద్దరు బంధువులు ప్రియాంకను కలవడానికి చునార్ అతిథి గృహానికి వెళ్లారు. మరో 15 మందిని ఎందుకు కలవనివ్వట్లేదని ప్రియాంక ప్రశ్నించారు. వెంటనే వాళ్లను కలవడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.
11:24 July 20
తృణమూల్ కాంగ్రెస్ సభ్యులూ...
సోన్‌భద్ర బాధితులను కలిసేందుకు బయలుదేరిన తృణమూల్ కాంగ్రెస్ బృందాన్ని వారణాసి విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
11:07 July 20
24 గంటలుగా పోలీసుల అదుపులో ప్రియాంక
ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చునార్ అతిథి గృహంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ధర్నా చేపట్టారు. సోన్‌భద్ర బాధితులను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని శుక్రవారం పోలీసులు అడ్డగించి అతిథి గృహానికి తరలించారు. రాత్రంతా అతిథి గృహంలోనే ఉన్నారు. అవసరమైతే జైలుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు ప్రియాంక. బాధితులను కలిసేంత వరకు తాను ఉత్తరప్రదేశ్‌ను వదలి వెళ్లనన్నారు.