గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. పార్టీ పదవి చేపట్టిన తర్వాత తొలి రాజకీయ ర్యాలీలో ప్రసంగించిన ప్రియాంక... నిరుద్యోగ సమస్యను అస్త్రంగా చేసుకుని ప్రధాని మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ ఇలాఖా అయిన గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ర్యాలీలో ప్రియాంక మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
రానున్న రెండు నెలలు దేశానికి ఎంతో ముఖ్యమని, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు నిలదీయాలని ఆమె అన్నారు.
"బాగా ఆలోచించి ఈసారి ఎన్నికల్లో ఓటు వేయండి. హామీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయని... మీ ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లడేవారిని, హామీలు ఇచ్చేవారిని అడగండి. 15 లక్షలు మీ ఖాతాలో వేస్తామన్న వారిని ఆ ధనం ఏమైందని అడగండి. ఎప్పుడూ మహిళల భద్రత గురించి మాట్లాడతారు. కానీ ఈ నాలుగేళ్లలో మహిళల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఈ సారి ఎన్నికల్లో సరైన ప్రశ్నలు అడగండి."
--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి