ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండో సారి ఎన్నికయిన అనంతరం మొదటిసారి నిర్వహించిన నీతి ఆయోగ్ పాలక మండలి 5వ సమావేశం వివిధ అంశాలపై చర్చకు వేదికైంది. కరవు, వ్యవసాయ రంగంలో సంస్కరణలపై ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో 2024 నాటికి భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 2.75 ట్రిలియన్లని అంచనా. ఈ మొత్తాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని ఆకాంక్షించారు మోదీ. జిల్లా స్థాయి నుంచే జీడీపీ వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని దిశా నిర్దేశం చేశారు.
2022 నాటికి నవభారత నిర్మాణమే లక్ష్యమని ప్రధాని ఉద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టనున్న సంస్కరణలపై ప్రధాని మోదీ సమావేశంలో వివరించారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ పెట్టుబడులు, రవాణా సౌకర్యాల మెరుగుదల, మార్కెట్ మద్దతుకు ప్రోత్సాహమందించాల్సి ఉందన్నారు. ఆహార శుద్ధి రంగాన్ని వేగంగా అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు మోదీ. అన్ని రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ అమలుకై రాష్ట్రాలకు సూచన చేశారు.
ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రుల గళం
ఒడిశాకు ప్రత్యేక హోదా అంశాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమావేశంలో లేవనెత్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రకృతి విపత్తులనూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇటీవల ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపానుకు 14 జిల్లాలు ప్రభావితమయ్యాయని, రూ.9336 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని వివరించారు.