లింగ సమానత్వంలో భారత న్యాయవ్యవస్థ చేసిన కృషిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. సుప్రీం కోర్టు ఎప్పుడూ చురుకుగా, ప్రగతిశీలకంగా పని చేస్తుందని తెలిపారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో జరుగుతోన్న అంతర్జాతీయ న్యాయ సదస్సు సమావేశం-2020 ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రసంగించారు రాష్ట్రపతి.
ప్రగతిశీల సామాజిక మార్పు సాధన కోసం చేసే పోరాటానికి సుప్రీం కోర్టు నాయకత్వం వహిస్తోందని కొనియాడారు కోవింద్. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల కట్టడికి అమలు చేస్తున్న రెండు దశాబ్దాల నాటి విశాఖ మార్గదర్శకాలను ప్రస్తావించారు. సైన్యంలో మహిళలకు సమానత్వం కల్పిస్తూ.. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గుర్తు చేశారు.
"లింగ సమానత్వాన్ని సాధించడంలో సుప్రీం కోర్టు ఎప్పుడూ చురుకుగా, ప్రగతిశీలకంగా పనిచేస్తుంది. సామాన్య ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చేందుకు ఎన్నో సంస్కరణలను చేపట్టిన సుప్రీం కోర్టు.. ప్రశంసలకు అర్హమైనది. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులను దాదాపు 9 భాషల్లో సామాన్యులకు అందుబాటులో ఉంచుతోంది. భాషా వైవిద్యంలో ఇదొక కొత్త అధ్యాయం అని చెప్పాలి. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు కేవలం భారత న్యాయ వ్యవస్థకే కాకుండా.. అన్ని దేశాల న్యాయ వ్యవస్థకూ బలాన్ని చేకూర్చుతాయని ఆశిస్తున్నా."