శనివారం విడుదలైన అసోం ఎన్ఆర్సీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దాదాపు 19 లక్షల మందికిఈ జాబితాలో చోటు దక్కకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబీకుల పేర్లూ ఎన్ఆర్సీలో లేకపోవడం చర్చనీయాంశమైంది.
భారత 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సోదరుడు ఎహ్త్రాముద్దీన్ కుటుంబ సభ్యుల పేర్లు ఎన్ఆర్సీలో లేవు. జియాఉద్దీన్(ఎహ్త్రాముద్దీన్ కుమారుడు) కుటుంబం ఎన్నో ఏళ్లుగా అసోంలోని కామ్రూప్ జిల్లాలో నివసిస్తోంది. మాజీ రాష్ట్రపతి సహా తమ పూర్వీకుల పేర్లు 1951 ఎన్ఆర్సీలో కనపడకపోవడంపై జియాఉద్దీన్ కుటుంబం ఆశ్చర్యపోయింది. 1971 ముందు వరకు ఉన్న ఓటరు జాబితాల్లోనూ వీరి పేర్లు లేవు. అందుకే వీరు ఈసారి ఎన్ఆర్సీకి నమోదు చేసుకోలేకపోయారు.
ఎన్ఆర్సీలో తమ కుటుంబంలోని 8 మంది పేర్లు లేవని జియాఉద్దీన్ కుమారుడు సాజిద్ అలీ అహ్మద్ వెల్లడించారు. కొన్ని రికార్డుల్లో ఎహ్త్రాముద్దీన్ అహ్మద్ పేరు తప్పుగా పలకడమే ఇందుకు కారణమని రిపోర్టులు స్పష్టం చేశాయి.