భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు అరుదైన గౌరవం దక్కింది. మెక్సికో అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది అగ్విలా అజ్టెకా' అవార్డును అందుకున్నారు ప్రతిభ. మెక్సికో అంబాసిడర్ మెల్బా ప్రియా పుణెలోని రాయబార కార్యాలయంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రతిభా పాటిల్ 2007-2012మధ్యకాలంలో భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
రెండో వ్యక్తి...
మెక్సికో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న వారిలో ప్రతిభా పాటిల్ రెండోవారు. ఇంతకుముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఈ గౌరవం దక్కింది.
తాను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు భారత్, మెక్సికో మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని పురస్కారం అందుకున్న అనంతరం వెల్లడించారు ప్రతిభా పాటిల్. 2007లో మెక్సికో అధ్యక్షుడు ఫిలిప్ డి జాజస్ హినోజోసా భారత్‌లో పర్యటించారన్నారు. తాను 2008లో మెక్సికోలో పర్యటించానని ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడిందని తెలిపారు.
మెక్సికోతో మానవ సంబంధాల బలోపేతానికి కృషి చేసిన విదేశీయులకు ఈ పురస్కారాన్ని అందజేస్తుంటామని ఈ దేశ రాయబారి మెల్బా ప్రియా వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆర్థిక వృద్ధికి నూతన సంస్కరణలు: నీతి ఆయోగ్