'ఉత్తర్‌ప్రదేశ్‌లో కదులుతున్న బస్సులో ఓ మహిళపై రాత్రంతా పలుమార్లు అత్యాచారం చేసి, తెల్లవారుజామున బస్సులోంచి తోసేశారు. మేరఠ్ జిల్లా సర్ధనాకు చెందిన మహిళ.. శుక్రవారం రాత్రి దిల్లీ వెళ్లేందుకు బైసాలి బస్టాప్‌లో బస్సు ఎక్కింది. కొద్దిసేపటికి బస్సులోని అందరూ దిగిపోయారు. ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపిన డ్రైవర్, కండక్టర్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. స్ఫృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున బస్సులోంచి రోడ్డుపై తోసేసి వెళ్లారు. తీవ్ర గాయాలైన మహిళను పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.' అని వచ్చిన వార్తలు యూపీతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇదంతా ఆ మహిళ అల్లిన కట్టుకథ అని తేలింది.
మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాలు, సదరు మహిళ మొబైల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మహిళ భర్తను ప్రశ్నించారు. వారి దర్యాప్తులో అన్ని అబద్ధాలేనని తేలింది.
దర్యాప్తు ప్రకారం.. 35 ఏళ్ల ఆ మహిళకు 8 ఏళ్ల వయసున్న బిడ్డ ఉంది. మద్యానికి బానిసైన ఆమె మూడేళ్ల క్రితం తన భర్తను వదిలేసింది. కొద్ది రోజులు సరూర్పుర్లో ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. అనంతరం అతన్ని వదిలేసి తన తమ్ముడి వద్దకు చేరింది. ఎవరికి చెప్పకుండా పలు సందర్భాల్లో ఇంటిలోంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.