తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓటమికి బాధ్యుల్లో ఆ ముగ్గురే కీలకం' - priyanka

సార్వత్రిక ఫలితాల తర్వాత కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో పలువురు నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. పార్టీ వర్గాల సమాచారం మేరకు  వారసత్వం కోసం ముగ్గురు సీనియర్​ నాయకులు ఇబ్బంది పెట్టినట్టు ఆరోపించారు రాహుల్.

సీడబ్ల్యూసీ సమావేశం

By

Published : May 27, 2019, 9:36 AM IST

సీడబ్ల్యూసీ సమావేశం

సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పలువురు నేతలపై రాహుల్​తో పాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపణలు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు సీనియర్‌ నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పార్టీని ఇబ్బంది పెట్టారని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. కాంగ్రెస్ సీనియర్​ నేతలు పి.చిదంబరం, కమల్​నాథ్, అశోక్​ గెహ్లోత్​ ఇబ్బంది పెట్టిన సందర్భాలను రాహుల్​ లేవనెత్తినట్టు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.

'వారి వల్లే నష్టం'

మొత్తంగా 52 స్థానాల్లోనే గెలవడం, 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అసలు బోణీయే కొట్టకపోవటంపై రాహుల్​ పెదవి విరిచినట్లు తెలిసింది.

"టికెట్​ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని చిదంబరం బెదిరించారు. కుమారుడికి టికెట్​ ఇవ్వకుంటే ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగేది అని కమల్​నాథ్​ బెదిరించారు. కుమారుడికి జోధ్​పుర్​ టికెట్​ ఇప్పించుకున్న గెహ్లోత్​.. వారం రోజులపాటు అక్కడే ప్రచారం నిర్వహించి మిగతా నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేశారు." అని సమావేశంలో రాహుల్ ఆరోపణలు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రియాంక అసహనం

కీలక నేతలెవరూ ప్రధాని నరేంద్రమోదీపై గట్టిగా పోరాడలేదని ప్రియాంక ఆక్షేపించారని సమాచారం. నాలుగు గంటలకుపైగా సాగిన సమావేశంలో ప్రియాంక గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారంతా ఈ గదిలోనే ఉన్నారని’ ప్రియాంక వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

నేతలపై ఆగ్రహం

ఓటమికి బాధ్యతగా రాజీనామాను రాహుల్​ ప్రతిపాదించగా కొందరు సీనియర్‌ నేతలు సర్ది చెబుతుండగా ప్రియాంక వారిపై మండిపడ్డారని సమాచారం. తన సోదరుడు ఒంటరిగా పోరాడుతుంటే మీరెక్కడ ఉన్నారని తీవ్ర స్వరంతో ప్రశ్నించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా చేస్తే భాజపాకు అనుకూలంగా మారుతుందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

రాహుల్‌గాంధీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించిన రఫేల్‌ ఒప్పందం, కాపాలాదారుడే దొంగ వంటి నినాదాలను పార్టీ నేతలు నిర్లక్ష్యం చేశారని ప్రియాంక ఆరోపించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేతలు మాత్రం తామెలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని చెప్పగా రాహుల్ కొట్టిపారేశారని తెలిసింది.

ఇదీ చూడండి: '300 సీట్లు గెలుస్తామంటే... ఎగతాళి చేశారు'

ABOUT THE AUTHOR

...view details