గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత జవాన్ల వీరమరణం.. తీవ్ర మనోవేదనను కల్గించిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన ఆమె... వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ... భారత సైన్యం, సైనికులు, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని స్పష్టంచేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల ముందుకు వచ్చి నిజమేంటో చెప్పాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
"భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో అమరులైన వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ప్రధాన మంత్రి దేశ ప్రజల ముందుకు వచ్చి నిజమేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. మన భూభాగాలను చైనా ఏ విధంగా ఆక్రమించింది? 20 మంది సైనికులు ఎందుకు అమరులయ్యారు? సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పటికీ మన సైన్యాధికారులు, సైనికుల ఆచూకీ లభించాల్సి ఉందా? ఎంత మంది అధికారులు, జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు? మన భూభాగంలో చైనా ఏఏ ప్రాంతాలను ఆక్రమించింది? ఈ పరిస్థితిపై భారత సర్కారు విధానాలేంటి? ఈ సంకట పరిస్థితుల్లో సైనికులు, సైన్యం, భారత సర్కారుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది."
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఇదీ చదవండి:గురువారం మాస్క్ డే- కరోనాపై అవగాహనే లక్ష్యం