కరోనా టీకా ఉత్పత్తి, సరఫరాపై కేంద్రం కసరత్తు చేస్తున్న తరుణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశంలోని టీకా తయారీ సంస్థలను సందర్శించారు. అహ్మదాబాద్, హైదరాబాద్, పుణెలో సుడిగాలి పర్యటనలు చేసి టీకాపై సమీక్ష నిర్వహించారు.
తొలుత అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించారు మోదీ. చంగోదర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ పరిశోధనా కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. పీపీఈ కిట్ ధరించి శాస్త్రవేత్తలతో కలిసి ల్యాబ్‌లో కలియతిరిగారు. టీకా గురించి వారిని అడిగి సమాచారం తెలుసుకున్నారు.
"స్వదేశంలో తయారవుతున్న డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ గురించి తెలుసుకునేందుకు అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించాను. ఈ పరిశోధనలో పాల్గొన్న బృందానికి నా ప్రశంసలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణంలో వారికి సహాయపడేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
జైడస్ హర్షం
ప్రధాని మోదీ తమ ప్లాంట్‌ను సందర్శించడం పట్ల జైడస్ క్యాడిలా సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని పర్యటన స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఇది తమ ఉద్యోగుల్లో నూతనోత్తేజం నింపుతుందని, దేశ ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు శాయశక్తులా కృషి చేసేందుకు దోహదపడుతుందని జైడస్ సంస్థ పేర్కోంది.
అభివాదం
సమీక్ష అనంతరం సంస్థ కార్యాలయం వద్ద తనను చూసేందుకు గుమిగూడిన ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. దాదాపు గంటసేపు జైడస్ ప్లాంటు వద్ద గడిపిన ఆయన ఉదయం 11.40 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు.