అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీఅయోధ్యలో భూమిపూజ నిర్వహించనున్నట్టు అక్కడి పూజారులు వెల్లడించారు. అయోధ్యలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు ప్రధాని పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టు 3వ తేదీ నుంచే నిర్మాణ వేడుకలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 4న రామాచార్య పూజ, 5వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు భూమిపూజ చేసేందుకు నిర్ణయించారు. రామమందిరం ప్రాంతంతోపాటు, అయోధ్యలో ప్రధాని మోదీ మొదటిసారి పర్యటించనున్నారు.
'ఆగస్టు 3 లేదా 5వ తేదీన రామమందిరం భూమి పూజకు రావాలని ప్రధాని మోదీకి విన్నవించాం. పూజ చేసిన రోజే నిర్మాణ పనులను ప్రారంభించనున్నాం' అని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఇప్పుడే తేదీని కచ్చితంగా చెప్పలేనప్పటికీ.. ఆగస్టు 5న మోదీ అయోధ్యలో పర్యటించనున్నట్టు తనకు సమాచారం అందిందని వెల్లడించారు.