తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైత్రి 2.0: భారత్​-భూటాన్​ మధ్య 10 ఒప్పందాలు - prime minister

భూటాన్​ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లోతాయ్ షేరింగ్​తో సమావేశమయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. విద్యుత్‌ కొనుగోలు సహా భారత్‌-భూటాన్ మధ్య 10 అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా భూటాన్​లో రూపే కార్డు సేవలను అధికారికంగా ప్రారంభించారు మోదీ.

మైత్రి 2.0: భారత్​-భూటాన్​ మధ్య 10 ఒప్పందాలు

By

Published : Aug 17, 2019, 7:45 PM IST

Updated : Sep 27, 2019, 7:56 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్​లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని లోతాయ్ షేరింగ్​తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాల బలోపేతం, కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు.

భారత్‌-భూటాన్ మధ్య విద్యుత్‌ కొనుగోలు సహా 10 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటికి సంబంధించిన పత్రాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేశారు.

పర్యటనలో భాగంగా సెంటోకా డ్జోంగ్​లో మాంగ్‌డేచు జల విద్యుత్‌ కేంద్రాన్ని, సౌత్‌ ఆసియా శాటిలైట్‌ గ్రౌండ్ స్టేషన్‌ను ఆవిష్కరించారు మోదీ. ఇండో-భూటాన్‌ హైడ్రోపవర్ కార్పొరేషన్‌ను ప్రారంభించి ఐదు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా ప్రత్యేక స్టాంపులను విడుదల చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ.

సమావేశంలో మాట్లాడుతున్న మోదీ

"130 కోట్ల మంది భారతీయుల మనస్సులో భూటాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. నేను మొదటి సారి అధికారంలోకి వచ్చినపుడు ప్రధానిగా తొలి పర్యటనకు భూటాన్‌కు రావడం చాలా సహజమైన విషయం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భూటాన్‌ రావడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్‌-భూటాన్‌ మధ్య సంబంధాలు, ఇరుదేశాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భద్రతపై పరస్పరం ఆధారపడి ఉన్నాయి. భూటాన్​ లాంటి స్నేహపూర్వక పొరుగు దేశాన్ని ఎవరైనా కోరుకుంటారు. భూటాన్‌ ప్రగతిలో ప్రముఖ పాత్ర వహించడం భారత్‌ అదృష్టం. భూటాన్ పంచవర్ష ప్రణాళికల్లో భూటాన్ ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు భారత్ సహకారం ఎప్పుడూ ఉంటుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని


భూటాన్​లో రూపే కార్డు సేవలు

జన్​ధన్​ ఖాతాతో వచ్చే రూపే కార్డు ఇకపై భూటాన్​లోనూ చెల్లుబాటు కానుంది. సెంటోకా డ్జోంగ్​లో ఒక వస్తువును కొనుగోలు చేసి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు మోదీ.

మోదీకి ఘన స్వాగతం

రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌ వెళ్లిన మోదీకి పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ఆ దేశ ప్రధాని లోతాయ్ షేరింగ్. విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లే మార్గ మధ్యంలో మోదీకి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హోటల్‌ వద్ద భారత సంతతి ప్రజలతో కరచాలనం చేశారు ప్రధాని.

Last Updated : Sep 27, 2019, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details