కరోనాపై పోరులో భాగంగా స్వీడన్ ప్రధానమంత్రి స్టీఫెన్ లొఫ్వెన్తో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్ మహమ్మారిపై పోరులో ఇరు దేశాల సహకారంపై చర్చించారు. రెండు దేశాల్లో ఆరోగ్య, ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు.
"భారత్, స్వీడన్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్య సహకారం, సమాచార మార్పిడికి ఇద్దరు నేతలు ఆమోదం తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా ఈ నిర్ణయం ఎంతో ముఖ్యం.
- భారత ప్రభుత్వ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన పౌరులకు పరస్పర సహకారం అందించేందుకు మోదీ, స్టీఫెన్ అంగీకారం తెలిపారు. వైద్య సహకారం, పరికరాల సరఫరాకు సంబంధించి రెండు దేశాల అధికారుల మధ్య సంప్రదింపులకు కూడా ఆమోదించారు.
ఒమన్ సుల్తాన్తో...
కరోనా ప్రభావంపై ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్తోనూ సంభాషించారు మోదీ. కరోనాను నియంత్రించే మార్గాలపై ఆయనతో చర్చించారు. ఒమన్ లో ఉన్న భారతీయుల క్షేమం కోసం శ్రద్ధ వహించినందుకు సుల్తాన్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:కొవిడ్ సంక్షోభంలో ప్రధానికి సోనియా 5 సూచనలు