తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారందరికీ మోదీ అండ- వీరందరికీ హెచ్చరిక - ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన

"ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను నవంబర్​ చివరి వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు మోదీ. అన్​లాక్​-2లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్​పై పోరులో ప్రతి ఒక్కరూ నిబంధనలను కఠినంగా పాటించాలని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు ప్రధాని.

PM Modi announces extension of free ration scheme till end of Nov; Says Govt working on 'one nation, one ration card'
భారతీయులారా.. తస్మాత్​ జాగ్రత్త: మోదీ

By

Published : Jun 30, 2020, 6:01 PM IST

కరోనా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఊరట కలిగించేలా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. "ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను ఈ ఏడాది నవంబర్​ చివరి వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల 80 కోట్ల మంది భారతీయులు లబ్ధిపొందుతారని మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వివరించారు మోదీ.

"వానాకాలంలో అన్నిటికన్నా వ్యవసాయ రంగంలో ఎక్కువ పని ఉంటుంది. పైగా జులై నుంచి ముఖ్య పండుగలు మొదలవుతాయి. గురు పూర్ణిమ, పంద్రాగస్టు, రక్షాబంధన్​, శ్రీ కృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దసరా తదితర పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఫలితంగా అందరికీ అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజనను నవంబర్​ చివరి వరకు పొడిగించాలని నిర్ణయించాం. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం, గోధుమలు అందుతాయి. ఇందుకోసం రూ.90వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గత మూడు నెలల ఖర్చులతో కలిపి ఈ పథకానికి రూ. 1.5లక్షల కోట్లు ఖర్చు అవుతోంది."

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

రైతులు, పన్నుచెల్లింపు దారుల వల్లే.. ప్రభుత్వం ఈరోజున పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వగలుగుతోందని పేర్కొన్నారు ప్రధాని. ఇందుకోసం వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తస్మాత్​ జాగ్రత్త...

అన్​లాక్​-2వైపు దేశం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రజలకు కీలక సూచనలు చేశారు మోదీ. అన్​లాక్​-1 ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని అభిప్రాయపడిన మోదీ.. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

మాస్కు లేకుండా బయటకెళ్లిన ఒక దేశ ప్రధానికే రూ.13 వేలు జరిమానా విధించారని మోదీ తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని స్పష్టంచేశారు. స్థానిక ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన చర్యల్ని పకడ్బందీగా చేపట్టాలని నిర్దేశించారు మోదీ.

వానా కాలం వచ్చింది...

వానా కాలంలో జ్వరాలు, జలుబు వంటి వ్యాధులు పెరుగుతాయని.. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు మోదీ. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో అందరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.

కంటైన్​మెంట్​ జోన్లపై ప్రత్యేక దృష్టి...

లాక్​డౌన్​తో లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగినట్టు తెలిపారు ప్రధాని. కంటైన్​మెంట్​ జోన్లపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఒకే తరహా అప్రమత్తతను ప్రదర్శించాలని స్పష్టం చేశారు.

ఇతర దేశాలతో పోల్చుకుంటే...

ఇతర దేశాలతో పోల్చుకుంటే దేశంలో పరిస్థితులు నిలకడగా ఉన్నాయని ప్రధాని వెల్లడించారు. సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, చర్యలు ఇందులో కీలక పాత్ర పోషించాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details