తీవ్రమైన వరదలతో అతలాకుతలమవుతున్న అసోంకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.
అసోం పరిస్థితిపై ఆ రాష్ట్రానికి చెందిన 10 మంది ఎంపీల ప్రతినిధి బృందంతో ప్రధాని సమావేశమయ్యారు. ఏటా రోడ్లు, ఇళ్లు, పంటలను దెబ్బతీస్తున్న విపత్తులను ఎదుర్కొనేందుకు తమ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎంపీలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. సంక్షోభం నుంచి బయటపడడానికి తగిన ఆర్థికసాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
"కేంద్రమంత్రి శ్రీరామేశ్వర్ తేలితో సహా పదిమంది అసోం ఎంపీల ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. రాష్ట్రంలోని ప్రస్తుత వరద పరిస్థితులపై, బాధితులను ఆదుకోవడానికి తీసుకుంటున్న సహాయక చర్యల గురించి చర్చలు జరిపారు."- ప్రధానమంత్రి కార్యాలయం.
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అసోంలో నదులు ఉప్పొంగి, జనావాసాలను వరదలు ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా అసోంలోని 33 జిల్లాల్లో 28 జిల్లాలు నీటమునిగాయి. వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 36 మంది మరణించారు. 54 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరో 1.11 లక్షల మంది వరద బాధితులు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
అసోం వరదల ధాటికి ఖడ్గమృగాలకు ప్రసిద్ధిగాంచిన.... కాజీరంగ నేషనల్ పార్క్, పొబితోరా వన్యప్రాణుల అభయారణ్యంలోని అడవి జంతువులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.
బిహార్ వరద బాధితులకు రూ.6 వేల ఆర్ధికసాయం
బిహార్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఎగువన ఉన్న నేపాల్ నుంచి వరదనీరు వస్తుండటం కారణంగా 12 జిల్లాలు నీట మునిగాయి. వరదల్లో చిక్కి మరణించినవారి సంఖ్య 92కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 66 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం సహాయకచర్యలు కొనసాగిస్తోంది.