జోరు వానలోనూ పోలింగ్ కేంద్రాలకు తరలిన జనం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలవరకు 5.46 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటింగ్‌కు ఆటంకం కలిగేలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ జోరు వానను సైతం లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు.
లాతూర్‌లో భారీ వర్షం..
మహారాష్ట్ర లాతూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజలు గొడుగులు, రెయిన్ కోట్లు ధరించి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓటు వేయాల్సిందేనని చెబుతున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రుఫుల్ పటేల్, భాజపా ఎంపీ, నటుడు రవి కిషన్, నటి పద్మిని కొల్హాపుర్, ఎన్సీపీ సీనియర్ నేత సుప్రియా సూలే, నటి శుభ ఖోటే సహా పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరిక...
రాష్ట్రంలోని రాయాగఢ్, రత్నగిరి, సింధూగ్, పుణె, కొల్హాపుర్, సతారా, సంగ్లీ, సొలాపుర్, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా జిల్లాలో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. అయితే.. పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: పోలీసుల సంక్షేమానికి తగిన చర్యలు: అమిత్ షా