కరోనా మహమ్మారిపై పోరాటంలో యావత్ భారత దేశం ఒక్కతాటిపై ఉందని రుజువు చేశారు కోట్లాది మంది ప్రజలు. ప్రధాని పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సరిగ్గా రాత్రి 9గంటలకు తమ ఇళ్లలో లైట్లు ఆపి.. కొవ్వొత్తులు, దివ్వెలు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించారు. ఐకమత్యం, సంకల్ప బలంతో ముందుకు సాగి మహమ్మారిపై విజయం సాధిస్తామని చాటి చెప్పారు.
ప్రధాని మోదీ తన నివాసంలో జ్యోతిని వెలిగించి ప్రజలకు సంఘీభావం తెలిపారు. మోదీ తల్లి కూడా తన నివాసంలో దీపాలను వెలిగించారు.
ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ కుటుంబ సమేతంగా దీపాలను వెలిగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన నివాసంలో దీపాలను వెలిగించారు.
కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించారు ఉపరాష్ట్రపతి దంపతులు. పరిస్థితులు చక్కబడే వరకూ కరోనా పై పోరుకు ప్రతి నెలా 30 శాతం వేతనాన్ని విరాళంగా ప్రకటించారు వెంకయ్య నాయుడు. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి అవుతున్న అసత్య సమాచారం విషయంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించారు.