ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగించడం పట్ల దాయాది పాకిస్థాన్ స్పందించింది. భారత ప్రభుత్వ నిర్ణయం అక్రమమని, ఏకపక్షమని, దీన్ని ఖండిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది.
"చట్టవ్యతిరేక చర్యలు చేపడుతున్న భారత్‌ను నియంత్రించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం, సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటాం" అని వెల్లడించింది పాక్. కశ్మీరీల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నట్టు ఉద్ఘాటించింది.
కశ్మీర్ అంతర్జాతీయ అంశమని ప్రకటించిన పాక్ విదేశాంగ శాఖ... ఇందులో తాము కూడా ఒక భాగస్వామేనని చెప్పుకొచ్చింది. జమ్ముకశ్మీర్ అంశం అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న సరిహద్దు వివాదమని తెలిపింది.
ఈ అంశమై ఐరాస, ఇస్లామిక్ సహకార సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి. మిత్రదేశాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ అంశంపై మౌనంగా కూర్చోవని అభిప్రాయపడ్డారు.
"కశ్మీర్ వివాదాస్పద భూభాగమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పలు తీర్మానాలున్నాయి. వివాదాస్పద భూభాగమని ఐరాస అంగీకరించింది. భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు."
-షా మహ్మద్ ఖురేషి, పాక్ విదేశాంగ మంత్రి