బిహార్ ఎన్నికల్లో అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధించిన ఎంఐఎం పార్టీ.. వచ్చే బంగాల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. పశ్చిమ్ బంగాలోని ముస్లిం మతపెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. భవిష్యత్ ప్రణాళికలు, కలిసి పోటీ చేసే విషయంపై అక్కడి ముస్లిం నాయకుడు అబ్బాస్ సిద్దిఖీతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా సిద్దిఖీ.. దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.
బంగాల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించిన తర్వాత ఓవైసీ మొదటిసారిగా.. రాష్ట్రంలో పర్యటించారు. ఓవైసీ రాకను అధికార తృణమూల్ అడ్డుకుంటుందని ఆ పార్టీ నేతలు భావించారు. అందుకే ఈ సమావేశాన్ని రహస్యంగా ఉంచాలకున్నట్లు బంగాల్ ఎంఐఎం కార్యదర్శి జమీరుల్ హసన్ తెలిపారు.