తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ఆలస్యమైనా ఫర్వాలేదు.. స్లిప్పులు లెక్కించాల్సిందే"

ప్రతి నియోజకవర్గం పరిధిలో కనీసం 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలంటూ సుప్రీంకోర్టులో 21 పార్టీలు వేసిన పిటిషన్​ రేపు విచారణకు రానుంది.  ఫలితాలకు 6 రోజులు ఆలస్యమైనా ఎన్నికల సమగ్రతే తమకు ముఖ్యమని, వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీకి ఆదేశాలివ్వాలని విపక్షాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాయి.

"ఆలస్యమైనా ఫర్వాలేదు.. స్లిప్పులు లెక్కించాల్సిందే"

By

Published : Apr 7, 2019, 8:27 PM IST

Updated : Apr 7, 2019, 11:13 PM IST

"ఆలస్యమైనా ఫర్వాలేదు.. స్లిప్పులు లెక్కించాల్సిందే"

వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కిస్తే ఫలితాలకు 5.2 రోజులు ఆలస్యమవుతుందన్న ఈసీ సమాధానానికి విపక్షాలు కౌంటర్​ దాఖలు చేశాయి. లోక్​సభ ఎన్నికల ఫలితాలకు 6 రోజులు ఆలస్యమైనా తమకు ఫర్వాలేదని.. వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించాలని కోరాయి.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని 21 పార్టీల నేతలు ఈ మేరకు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కించాలన్న పిటిషన్​పై సుప్రీం రేపు విచారించనుంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం రేపు వాదనలు విననుంది.

"ఎన్నికల సమగ్రతకు.. 5.2 రోజులే అడ్డయితే అది పెద్ద సమస్యకాదు. వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కించమనేది ఎన్నికల సంఘంపై అనుమానంతో ఎంతమాత్రం కాదు. ప్రజలకు ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయనే విశ్వాసం ఇవ్వడానికే. ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించాలనుకుంటున్న ఈసీ తమ యంత్రాంగాన్ని పెంచి వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్న మా అభ్యర్థనను మన్నించాలి."
- ప్రమాణపత్రంలో 21 పార్టీల నేతలు

ఫలితాలు ఆలస్యమవుతాయి...

అంతకుముందు వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపుపై తమకున్న అభ్యంతరాలు తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. దీనిపై ఈసీ ప్రమాణపత్రం దాఖలు చేసింది. ప్రతిపక్షాలు కోరుతున్నట్లుగా వీవీప్యాట్‌లను లెక్కిస్తే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆలస్యమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకు తెలిపింది.

"ప్రతి పార్లమెంటరీ లేదా శాసన సభ నియోజకవర్గంలోనూ సగటున 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటే ఓట్ల లెక్కింపునకు అవసరమయ్యే సమయం మరో 5.2 రోజులు పెరుగుతుంది. దీని కోసం మరో 6 రోజుల పాటు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. వారికి ప్రత్యేక శిక్షణనివ్వాలి."

-ఈసీ ప్రమాణపత్రం

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఒక్కో శాసన సభ నియోజకవర్గంలో, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్‌లో మాత్రమే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించటానికి అవకాశం ఉంటుంది. దీనిని వ్యతిరేకిస్తూ 21 ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

Last Updated : Apr 7, 2019, 11:13 PM IST

ABOUT THE AUTHOR

...view details