ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యే సరికి ప్రతిపక్షాల ఓటమి ఖరారైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను వారి ఇంట్లోకి చొరబడి మట్టుబెట్టగల సమర్థనీయ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారంటూ భాజపా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ కుషీనగర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు ప్రధాని. మహాకూటమి పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లో ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే మాయావతి మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు.
" ఐదు దశల పోలింగ్ పూర్తయింది. ప్రతిపక్షాలు నలు మూలలా ఓడాయి. చౌకీదార్‌పై ప్రజలకు ఇంత ప్రేమ ఎందుకని వాళ్లకు అర్థం కావడం లేదు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఎలా పనిచేస్తాయో రాజస్థాన్‌లో వారి పాలన రుజువు చేస్తుంది. ఆ రాష్ట్రంలో ఒక ఎస్సీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతోంది. మాయావతి ఇంకా ఎందుకు మద్దతు ఉపసంహరించుకోలేదు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: ఆస్పత్రిలో ఏసీ పనిచేయక లాలూ ఇక్కట్లు