దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. ఉల్లిపాయలకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదునుగా సొమ్ము చేసుకునేందుకు దొంగలు రెచ్చిపోతున్నారు. గోదాముల్లో దాచుకున్న విలువైన పంటను చోరీ చేస్తున్నారు. తాజాగా బిహార్లో రూ.8 లక్షలు, మహారాష్ట్రలో లక్ష రూపాయలు విలువైన ఉల్లిని ఎత్తుకెళ్లిపోయారు.
గోదాములోని ఉల్లి చోరీ...
బిహార్ రాజధాని పట్నాలోని ఫతుహా ప్రాంతంలో ఉల్లిగడ్డలను గోదాములో భద్రపరిచాడు ఓ రైతు. దొంగలు దాదాపు 8 లక్షల రూపాయలు విలువైన పంటను చోరీ చేశారు. విషయాన్ని గుర్తించిన రైతు... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మహారాష్ట్రలోనూ చోరీ....
మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నాసిక్ జిల్లాకు చెందిన రాహుల్ బాజీరావ్ పాగర్ అనే రైతు.. లక్ష రూపాయలు విలువైన ఉల్లి పంటను దుకాణంలో భద్రపరిచాడు. ఆ ఉల్లిపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాజీరావ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.