కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ను విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ లాక్డౌన్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడింది మాత్రం వలస కార్మికులే. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు.. తిరిగి సొంత రాష్ట్రాలకు చేరుకోవటానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. కాలినడకన, సైకిళ్లు, ఇతర మార్గాల ద్వారా సొంత గూటికి చేరుకుంటున్నారు. వీరిలో 90శాతం మంది అసంఘటిత రంగానికి చెందిన వారే ఉన్నారు. ప్రస్తుతం కార్మికులు పడుతున్న అవస్థలను చూస్తే ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతోంది. అందువల్ల కార్మికుల చట్టాలను మరింత పకడ్బందీగా రూపొందించాల్సిన అవసరం ఉందని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లాయ్‌మెంట్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ అమిత్ బసోల్ అభిప్రాయపడ్డారు.
వలస కార్మికుల సంక్షోభం ఓ గుణపాఠం లాటిందని అభిప్రాయపడ్డారు అమిత్ బసోల్. ఇలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా ఉండాలంటే.. దేశవ్యాప్తంగా కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలన్నారు. ఇలా కార్మికుల వివరాలను సేకరించటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు బసోల్.
"కార్మికులు ఎక్కడ పని చేస్తున్నారు? వారి సొంత రాష్ట్రం ఏమిటి? వారు ఏ రాష్ట్రంలో పని చేస్తున్నారు? ఇలా కార్మికులకు సంబంధించి పూర్తి వివరాలను ఆయా రాష్ట్రాలు సేకరించగలిగితే.. వారు ఎక్కడ పనిచేస్తున్నా.. వారికి అవసరమైన రేషన్, రవాణా సౌకర్యాలు అందజేయటానికి ప్రభుత్వానికి ఎంతో సులభం అవుతుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో పని చేసే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది."