పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్ గత 20 సంవత్సరాల్లో రెండు సార్లు భారత్-పాకిస్థాన్‌లను యుద్ధం ముంగిట్లో నిలబెట్టింది.
2001లో భారత్ పార్లమెంటుపై జైషే ఉగ్రవాదులు దాడి చేసినప్పడు భారత్-పాక్ దాదాపు యుద్ధానికి దగ్గరగా వెళ్లాయి. ఇటీవల 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ బస్సుపై చేసిన దాడితో రెండు దేశాల మధ్య మరోమారు అదే పరిస్థితి ఏర్పడింది.
నిఘా వర్గాల దగ్గరున్న సమాచారం ప్రకారం.... ఈ తీవ్రవాద సంస్థ 2017 నవంబర్ 27న పాకిస్థాన్‌లోని ఒకరా జిల్లాలో సమావేశం అయింది. ఇరు దేశాల సంబంధాలతో నిమిత్తం లేకుండా భారత్‌లో దాడులు కొనసాగించాలని తీర్మానించింది.
గత రెండు దశాబ్దాల్లో జైషే ఉగ్రసంస్థ చేసిన ఘాతుకాల్లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరం, ఉరీ, జమ్ముకశ్మీర్ ఆసెంబ్లీ దాడులు ఉన్నాయి. జైషే మహ్మద్‌కు ఆల్‌ఖైదా సంస్థతో పాటు, ఒకప్పటి దాని అగ్రనేత ఒసామా బిన్ లాడెన్‌తో దగ్గరి సంబంధాలు ఉండేవి.
విమాన హైజాక్‌తో మొదలు...
1999 డిసెంబర్ 34న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు ఉగ్రవాదులు. ప్రయాణికులను విడిపించేందుకు 1999 డిసెంబర్ 31న మసూద్ అజార్‌తో పాటు బ్రిటీష్ సీక్రెట్ సర్వీసెస్‌కు చెందిన ఒమర్ షేక్‌ను విడుదల చేసింది భారత ప్రభుత్వం. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రతినిధి డేనియల్ పెర్ల్‌ను 2002 జనవరిలో హత్య చేయటం సహా అమెరికాలో 9/11 దాడులకు లక్ష డాలర్లు సమకూర్చాడు షేక్.
హైజాక్ ఘటన అనంతరమే జైషే మహ్మద్‌ను మసూద్ అజార్ స్థాపించాడు. ఈ ఉగ్రసంస్థ 2000, 2001 సంవత్సరాల్లో జమ్ముకశ్మీర్‌లో వరుస దాడులు చేసింది.
2000 ఏప్రిల్‌లో మసూద్ ముఠా చేసిన దాడిలో 30 మంది సైనికులు మరణించారు. 2000 జూన్‌లో శ్రీనగర్‌లోని ఒక బస్టాండు వద్ద ముగ్గురు పోలీసులు, 2001 అక్టోబర్ 1న జమ్ముకశ్మీర్ అసెంబ్లీపై బాంబు దాడి చేసి 31 మందిని పొట్టనపెట్టుకుంది జైషే మహ్మద్. 2001 డిసెంబర్ 13న భారత్ పార్లమెంటుపై చేసిన దాడిలో 9 మంది మరణించారు.