తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూట్యూబ్​ చూసి... లోన్ ఇచ్చిన‌ బ్యాంకులకే కన్నం

బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చేందుకు అవే బ్యాంకులకు కన్నం పెట్టాడు ఓ యువ వ్యాపారి. లాక్​డౌన్​తో వ్యాపారం దెబ్బతినడం వల్ల.. రుణాల ఊబి నుంచి గట్టెక్కేందుకు ఇలా తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు భువనేశ్వర్‌కు చెందిన 25ఏళ్ల సౌమ్యరంజన్‌ జీనా. చివరకు చోరీ చేసిన డబ్బునే డిపాజిట్ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు.

Businessman robs two banks
బ్యాంకుల రుణం తీర్చేందుకు అవే బ్యాంకులక్లో చోరీ

By

Published : Oct 6, 2020, 2:29 PM IST

కరోనా కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన ఓ యువ వ్యాపారి.. వాటి నుంచి గట్టెక్కాలని తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించేందుకు అవే బ్యాంకులకు కన్నం పెట్టాడు. యూట్యూబ్‌లో చోరీల వీడియోలు చూసి లూటీ చేశాడు. చివరకు అదే డబ్బును డిపాజిట్‌ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిందీ ఘటన.

ఆదాయంపై కరోనా ప్రభావం..

భువనేశ్వర్‌కు చెందిన 25ఏళ్ల సౌమ్యరంజన్‌ జెనా గత కొన్నేళ్లుగా రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారం సాగిస్తున్నాడు. ఏడాదికి రూ. 10లక్షల టర్నోవర్‌తో కరోనా ముందు వరకు వ్యాపారం సజావుగానే సాగింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఇటీవల దుకాణాలు మూతబడటం వల్ల జెనా వ్యాపారం దెబ్బతింది. ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి.

జెనా ఇప్పటికే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి దాదాపు రూ. 19లక్షల వరకు రుణాలు తీసుకున్నాడు. గత కొన్ని నెలలుగా రాబడి లేకపోవడం వల్ల తీసుకున్న అప్పులు చెల్లించడం కష్టమైంది. దీనితో ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఓ పథకం వేశాడు.

యూట్యూబ్ వీడియోలు చూసి..

యూట్యూబ్‌లో చోరీ వీడియోలు చూసి ఓ బొమ్మ తుపాకీ కొన్నాడు జెనా. సెప్టెంబరు 7న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు వెళ్లి అక్కడి సిబ్బందిని బెదిరించి డబ్బు దోచుకున్నాడు. పోలీసులు తనను పట్టుకోవట్లేదని భావించిన జెనా.. అదే నెల 28వ తేదీన బ్యాంక్‌ ఆఫ్ ఇండియా‌కు వెళ్లి మళ్లీ చోరీ చేశాడు. రెండు బ్యాంకుల నుంచి దాదాపు రూ. 12లక్షల వరకు దోచుకున్నాడు. అయితే దోచుకున్న డబ్బు మొత్తం ఒకేసారి వాడేస్తే దొరికపోతానని భావించిన జెనా.. అందులో నుంచి కొంచెం కొంచెంగా బ్యాంకులకు చెల్లించాలని అనుకున్నాడు. డబ్బు డిపాజిట్‌ చేసేందుకు సోమవారం బ్యాంకుకు వచ్చాడు. అయితే చోరీ సమయంలో జెనా ఉపయోగించిన స్కూటీని గుర్తించిన బ్యాంక్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బ్యాంక్‌లోనే అతడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌. సారంగి మీడియాకు తెలిపారు. జెనా నుంచి రూ. 10లక్షల నగదు, స్కూటీ, బొమ్మ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:'ప్రజాప్రతినిధుల' కేసులపై సుప్రీం విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details