స్కీముల పేరిట స్కాములు చేసిన వారిని చూశాం. నకిలీ బంగారం, దొంగనోట్లు అంటగడుతూ ప్రజలను మోసం చేసే వారినీ చూశాం. కానీ అత్యంత విలువైన, అరుదుగా లభించే రేడియోధార్మిక పదార్థాల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ముఠాను చూశారా? ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రేడియోధార్మిక పదార్థంపై పెట్టుబడి పెట్టి వందల కోట్లు సంపాదించొచ్చని ప్రజలను మోసం చేస్తోందో ముఠా. దీని నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు రాజస్థాన్లోని జైపూర్ పోలీసులు. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.
"బొమ్మ" చూపిస్తారు:
ముంబయిలో రెన్సెల్ ఇండియా అనే నకిలీ సంస్థను నడుపుతున్న గణేశ్ ఇంగోలే ఆధ్వర్యంలో ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది. అంతర్జాతీయ అణు సంస్థలతో అనుంబంధం ఉందంటూ గణేశ్, అతని భాగస్వామి సత్యనారాయణ ప్రజల్ని నమ్మించారు. డీఆర్డీఓ గుర్తింపు పొందిన అరుదైన రేడియోధార్మిక పదార్థంతో చేసిన "డాన్సింగ్ డాల్" తమ దగ్గరుందని చెప్పారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ బొమ్మను అధిక ధరకు కొనుగోలు చేస్తుందని నమ్మించారు.