తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం - పెద్దల సభకు పెద్ద పండగ

నవంబర్​ 18 పెద్దల సభకు పెద్ద పండుగ. అంటే రేపు రాజ్యసభ 250వ సమావేశం జరుగబోతోంది. దేశ నేతల దార్శనికతకు అనుగుణంగా కొలువుదీరి.. 67 ఏళ్ల చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది ఎగువసభ.

రేపే రాజ్యసభ 250వ సమావేశం

By

Published : Nov 17, 2019, 4:35 AM IST

పార్లమెంటులోని పెద్దల సభ ఓ పెద్ద పండగకు సిద్ధమవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో తనదైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న రాజ్యసభ నవంబర్​ 18న 250వ సమావేశం జరుపుకోనుంది. దేశనేతల దార్శనికతకు అనుగుణంగా కొలువుదీరి... దిశా నిర్దేశానికి చుక్కానిగా నిలుస్తున్న శాశ్వత సభ 1952 మే 13న మొదలైంది. 67 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఘట్టాలకు సాక్షిగా నిలిచింది.

200వ రాజ్యసభ సమావేశంనాటి దృశ్యం

ఏర్పాటు ఉద్దేశం

మేధావులు, ఆలోచనపరులు, అనుభవజ్ఞులతో ఈ సభ.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాటి ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఆవేశకావేశాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో చట్టాలపై చర్చించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. ప్రజల నుంచి ఎన్నికైన దిగువ సభ సభ్యులు ఎన్నికల దృష్టితో చట్టాలు చేసుకుంటూపోతే ఇబ్బందులు ఎదురుకావచ్చని భావించడం మరో కారణం. చట్టాల దీర్ఘకాలిక ప్రభావాలను, మంచిచెడ్డల్ని ఈ సభ విశ్లేషించి మార్పులు చేర్పులు చేస్తుంది.

సభ్యుల సంఖ్యకు ప్రామాణికం

రాజ్యసభ స్వరూపం ఎలా ఉండాలో రాజ్యాంగ కమిటీ 1947 జులై 21న కొన్ని సూచనలు చేసింది. దిగువ సభకు లోక్‌సభ (హౌస్‌ ఆఫ్‌ ద పీపుల్‌) అని, ఎగువ సభకు రాజ్యసభ (కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌) అని పేరు పెట్టాల్సిందిగా పేర్కొంది. ఎగువ సభలో 250 మంది సభ్యులు ఉండాలని తెలిపింది.

  • పది లక్షల నుంచి 50 లక్షల మంది జనాభాకు ఒక సభ్యుడు చొప్పున ప్రాతినిధ్యం వహించాలి. ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేవారి సంఖ్య 20కి మించకూడదు.
  • ఉప రాష్ట్రపతే ఎగువ సభకు అధ్యక్షుడిగా ఉండాలని, ఆయన అప్పటికే అదే సభలో సభ్యుడిగా ఉంటే మాత్రం తన సభ్యత్వాన్ని వదులుకోవాలని షరతు విధించింది. దీని ప్రకారమే ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆ పదవికి ఎంపికయ్యే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

కొన్ని ముఖ్య ఘట్టాలు

రాజ్యసభ ఛైర్మన్‌ ఇప్పటివరకూ ఒకే ఒకసారి (1991లో) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సౌమిత్ర సేన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొంది, దిగువ సభకు వెళ్లకముందే ఆయన రాజీనామా చేశారు.
  • విభిన్న కారణాలతో ఇప్పటివరకూ సుబ్రహ్మణ్య స్వామి, ఛత్రపాల్‌ సింగ్‌ లోధా, సాక్షి మహరాజ్‌లను సభ బహిష్కరించింది. ఏడుగురిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది.
  • సభా మర్యాదను తగ్గించేలా మాట్లాడినందుకు కేకే తివారీ అనే మాజీ ఎంపీని 1990లో సభ పిలిపించి హెచ్చరించింది.
  • అత్యవసర సేవల నిర్వహణ బిల్లును ఆమోదించడానికి రాజ్యసభ 1981 డిసెంబర్‌ 17 ఉదయం నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.43 గంటల వరకు కూర్చొంది. రాజ్యసభ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే సుదీర్ఘ సమావేశం.
  • రాజీవ్‌గాంధీకి భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంపై 1991 జూన్‌ 4న 12 గంటల 4 నిమిషాల చర్చ జరిగింది. ఇప్పటివరకూ సుదీర్ఘమైన చర్చ ఇదే.

శాశ్వత సభ

ఒక్క ద్రవ్యబిల్లులు ప్రవేశపెట్టే విషయంలో మినహా ఉభయ సభలకు సమానాధికారాలు ఉంటాయి. ప్రతిష్టంభన ఏర్పడి ఏదైనా బిల్లు ఆమోదం పొందని పరిస్థితి తలెత్తితే సంయుక్త సమావేశం నిర్వహించి, ఆమోదముద్ర వేసే అవకాశాన్ని కల్పించారు.

  • రాజ్యసభకు ఆది తప్పితే అంతం లేదు. ప్రతి రెండేళ్లకు మూడోవంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. అందుకే ప్రతి సమావేశానికి ఓ సంఖ్యను ఇస్తారు. అదే ఇప్పుడు 250కి చేరింది.
  • మొత్తం 245 మందిలో గరిష్ఠంగా 12 మందిని రాష్ట్రపతి నామినేట్‌ చేసే వీలుంది.

రాజ్యసభకు ప్రత్యేకాధికారాలు

రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజ్యసభకు ప్రత్యేక అధికారాలను రాజ్యాంగం కల్పించింది. ఏదైనా జాతీయ ప్రయోజనాల విషయంలో చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు పార్లమెంటు నేరుగా రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఆర్టికల్‌ 249 దీనికి వీలు కల్పిస్తుంది. మూడింట రెండొంతుల ఆధిక్యంతో రాజ్యసభ తీర్మానం చేస్తే.. రాష్ట్రాల జాబితాలోని అంశాలపైనైనా పార్లమెంటు చట్టం చేయడానికి వీలవుతుంది. అత్యవసర పరిస్థితి (ఆర్టికల్‌ 352), రాష్ట్రపతి పాలన (ఆర్టికల్‌ 356), ఆర్థిక అత్యవసర పరిస్థితి (ఆర్టికల్‌ 360) ప్రకటించినప్పుడు వాటిని నిర్దిష్ట గడువులోగా పార్లమెంటు ఉభయ సభలు ఏకకాలంలో ఆమోదించాలి. లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదం సరిపోతుంది.

వారిద్దరివీ దశాబ్ద కాల సేవలు

రాజ్యసభకు దశాబ్దం పాటు ఛైర్మన్‌గా సేవలందించిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (1952-62), హమీద్‌ అన్సారీ (2007-2017) ఉన్నారు.

వారిద్దరివీ దశాబ్ద కాల సేవలు

రాజ్యసభ సమావేశాల వివరాలు

రాజ్యసభ సమావేశాల వివరాలు

ఇదీ చూడండి: 'పార్లమెంట్​ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలి'

ABOUT THE AUTHOR

...view details