కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేదని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అభిప్రాయపడ్డారు. బలపరీక్షలో ఓడి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కాంగ్రెస్- జేడీఎస్ అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలు... ఉపఎన్నికల దిశగా రాష్ట్రాన్ని నెట్టాయని కుమారస్వామి అన్నారు. ఈ పరిస్థితికి భాజపానే కారణమని విమర్శించారు.
"ప్రస్తుతం...అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి నిలపాలో లేదా 20 నుంచి 25 స్థానాలకు జరిగే ఉపఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితికి భాజపానే కారణం. అయితే ఎన్నికల తరువాత కూడా ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని భావించడం లేదు."
-హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి