ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నీతి ఆయోగ్ ఉల్లంఘించలేదని ఈసీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించే ప్రాంతాల సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) నీతి ఆయోగ్ అందించడం నిబంధనలకు విరుద్ధమేమీ కాదని స్పష్టం చేసింది.
ప్రధాని ఎన్నికల ప్రచారానికి కావాల్సిన సమాచారం అందించాల్సిందిగా వివిధ రాష్ట్రాల అధికారులను నీతి ఆయోగ్ ఆదేశించిందని కాంగ్రెస్ ఆరోపించింది. పీఎంవోకు సమాచారం అందించి నీతి ఆయోగ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్కు ఈసీ మే 4న ఓ లేఖ రాసింది.
ప్రధానమంత్రి అధికారిక పర్యటనలకు, ఎన్నికల ప్రచారానికి సమాచారం అందించేలా నిబంధనల మినహాయింపు ఉందని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. అయితే ఈ మినహాయింపు మిగతా మంత్రులకు ఉండదని స్పష్టం చేశారు.