పౌరసత్వ చట్టం అమలును భూమిపై ఉన్న ఎటువంటి శక్తీ ఆపలేదని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు.
సోనియాగాంధీ నేతృత్వంలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ... సీఏఏను ఉపసంహరించుకోవాలని , ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అమలు ప్రక్రియను వెంటనే నిలివేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే భాజపా... కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగింది.
కాంగ్రెస్ వాగ్దానాల మాటేమిటి?
రాజస్థాన్ ఎన్నికల మేనిఫెస్టోలో హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు.
"రాజస్థాన్, గుజరాత్‌ల్లోని హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని 2005, 2006ల్లో అప్పటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించాలని కోరారు."- జీవీఎల్ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి
కాంగ్రెస్ ద్వంద్వ నీతి
2010లో లౌకికమైనదిగా ఉన్న ఎన్పీఆర్... 2020 నాటికి ఎలా ప్రమాదకరంగా మారిందో కాంగ్రెస్ వివరించాలని నరసింహారావు డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్పీఆర్ల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వనీతి ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.
ఇదీ చూడండి:'బర్త్‌డే విషెస్ చెప్పినంత మాత్రాన చర్చలు జరగవు'