ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతిఆయోగ్ పాలకమండలి ఐదో సమావేశం జూన్ 15న జరగనుంది. ఈ సమావేశంలో నీటి నిర్వహణ, వ్యవసాయం, భద్రత అంశాలను చర్చించనున్నారు.
నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. మోదీ 2.0 ప్రభుత్వ హయంలో జరుగుతున్న మొదటి సమావేశం ఇదే.
ఈ సమావేశంలో నీటి నిర్వహణ, వ్యవసాయం, జిల్లాల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల్లో ఉన్న వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన భద్రతా చర్యలు గురించీ చర్చిస్తారు.
ఇదీ ప్రస్థానం..
ప్రధాని అధ్యక్షతన నీతిఆయోగ్ పాలకమండలి సమావేశాలు 2015 ఫిబ్రవరి 8 నుంచి క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. 2015 జూలై 15న జరిగిన రెండో సమావేశంలో ముఖ్యమంత్రులతో కూడిన మూడు సబ్ గ్రూపులను, రెండు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.
2017 ఏప్రిల్ 23న జరిగిన మూడో పాలక మండలి సమావేశంలో... లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏక కాలంలో నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. అలాగే ఆర్థిక సంవత్సరానికి జనవరి నుంచి డిసెంబర్‌గా మార్చారు.
2018 జూన్ 17న జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి నాలుగో సమావేశంలో... వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు చేయాలని, ప్రభుత్వ ప్రధాన పథకాల పురోగతికి కృషి చేయాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: విరాళాల వివరాలు వెల్లడించని భాజపా, కాంగ్రెస్