వేర్వేరుగా ఉరి తీయాలన్న వ్యాజ్యంపై విచారణ వాయిదా నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యాజ్యంపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్భయ దోషులకు సూచించింది.
కేంద్రం పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్ బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం.. దోషి పవన్ గుప్తాకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాశ్‌ను అమికస్ క్యూరీ (న్యాయ సలహాదారు)గా నియమించింది. శుక్రవారం 2 గంటల వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
వినయ్ పిటిషన్ తిరస్కరణ
తన క్షమాభిక్ష తిరస్కరణ దస్త్రంపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి సంతకం చేయలేదంటూ.. నిర్భయ దోషి వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి రికార్డులను పరిశీలించిన ధర్మాసనం... పిటిషన్‌పై ఇరువురూ సంతకాలు చేసినట్లు వెల్లడించింది.
ఆలస్యం!
ఉరిశిక్ష పడిన దోషులకు చివరి న్యాయ పరిహారం అయిన క్యురేటివ్ పిటిషన్‌ను పవన్ గుప్తా ఇప్పటివరకు దాఖలు చేసుకోలేదు. క్షమభిక్ష పిటిషన్ అవకాశాన్నీ ఇంతవరకు వినియోగించుకోలేదు. పవన్ గుప్తాకు కొత్త న్యాయవాదిని ఏర్పాటు చేస్తే ఉరి శిక్ష అమలు మరింత ఆలస్యమవుతుందని ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశా దేవి.