దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దిల్లీ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. దోషులకు ఉరి అమలుపై స్టే విధిస్తూ.. దిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యంపై తీర్పు ఇవ్వనుంది.
దోషుల ఉరిపై ఉన్న స్టేను కొట్టివేయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై గత శని, ఆదివారాల్లో ప్రత్యేకంగా విచారణ చేపట్టిన జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈనెల 2కు తీర్పును వాయిదా వేసింది. ఈ విషయంపై అందరి వాదనలు విన్న తర్వాతే తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
పలుమార్లు వాయిదా..
నిర్భయ దోషుల మరణ శిక్ష అమలుపై ట్రయల్ కోర్టు జనవరి 7న డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు శిక్ష అమలు చేయాలని పేర్కొంది. కానీ.. దోషుల్లో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న సందర్భంగా తొలిసారి ఉరి వాయిదా పడింది. అనంతరం జనవరి 17న మరోమారు డెత్ వారెంట్ జారీ అయ్యింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు శిక్ష అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ.. తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయంటూ ఉరి అమలుపై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించారు నలుగురు దోషులు. ఈ నేపథ్యంలో స్టే విధిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది.
దిల్లీ కోర్టు తీర్పుపై ఈనెల 1న దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు. సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసింది దిల్లీ హైకోర్టు.