తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ: భారీ బందోబస్తు మధ్య తిహార్​కు తలారి 'పవన్​' - నిర్భయ

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు తిహార్​ జైలు అధికారులు. శిక్ష అమలు చేసే తలారి.. పవన్​ జల్లాద్​ను రేపు జైలుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో పవన్​కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అత్యంత భద్రత కలిగిన జైలు వ్యాన్​లో 20 మంది సాయుధ బలగాల మధ్య జైలుకు చేరుకోనున్నారు పవన్​.

Nirbhaya case
నిర్భయ: భారీ బందోబస్తు మధ్య తిహార్​కు తలారి 'పవన్​'

By

Published : Jan 29, 2020, 3:14 PM IST

Updated : Feb 28, 2020, 10:02 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సమయం దగ్గర పడుతున్న క్రమంలో మరణశిక్ష అమలు చేసేందుకు ఎంపికైన తలారి పవన్​ జల్లాద్​​ గురువారం తిహార్​ జైలుకు చేరుకోనున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​ నుంచి దిల్లీకి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

భారీ భద్రత నడుమ..

పవన్​ జల్లాద్​ను జైలుకు తరలించేందుకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 15-20 మంది సాయుధ పోలీసులు భద్రత కల్పిస్తారని.. ఇందుకోసం అత్యంత పటిష్ఠమైన జైలు వ్యాన్​ను వినియోగించనున్నట్లు వెల్లడించారు.

"భారీ భద్రత మధ్య తలారి పవన్ జల్లాద్​​ను గురువారం ఉదయం తిహార్​ జైలుకు తీసుకొస్తాం. దిల్లీకి చేరుకున్న వెంటనే జైలులో ఉరి అమలు చేసే విభాగానికి తరలిస్తాం."

- సందీప్​ గోయల్​, తిహార్​ జైలు డైరెక్టర్​ జనరల్​.

మేరఠ్​ నుంచి దిల్లీకి ఏ మార్గంలో తరలించాలో ఇప్పటికే నిర్ణయించారు అధికారులు. అయితే.. అందులో మార్పు ఉండొచ్చని చెబుతున్నారు. దిల్లీ పోలీసులతోపాటు తమిళనాడు ప్రత్యేక దళం ఇందులో పాల్గొనుంది.

ఫిబ్రవరి 1న..

నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్​.. క్షమాభిక్ష​ తిరస్కరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయగా దానిని న్యాయస్థానం కొట్టి వేసింది. మరో దోషి అక్షయ్ క్యురేటివ్ పిటిషన్​ దాఖలు చేశాడు. దీనిపైనా స్పష్టత వచ్చి, న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలిగిపోతే.. నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నలుగురు దోషులు ముకేశ్​(32), పవన్​ గుప్తా(25), వినయ్​ శర్మ(26), అక్షయ్​ సింగ్​ (31)లను వారి బంధువులు, కుటుంబ సభ్యులు గత మంగళవారం కలిశారు.

ఇదీ చూడండి: సుప్రీంలో నిర్భయ దోషికి చుక్కెదురు- వ్యాజ్యం కొట్టివేత

Last Updated : Feb 28, 2020, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details