తమిళనాడుకు తర్వాత కాబోయే ముఖ్యమంత్రి విషయంపై భాజపా కీలక వ్యాఖ్యలు చేసింది. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి ఉంటారని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డు, ఎన్డీఏ సమన్వయ కమిటీ నిర్ణయిస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ఇంఛార్జి సీటీ రవి తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే ఖరారు చేస్తారా అన్న ప్రశ్నకు ఈమేరకు సమాధానం ఇచ్చారు.
"ఎప్పుడైనా సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డే ఎంపిక చేస్తుంది. అభ్యర్థి అన్నాడీఎంకే నుంచే ఉంటారు. ఎవరిని సీఎంగా చేయాలనుకుంటున్నారని వారి(అన్నాడీఎంకే)ను అడిగి తెలుసుకుంటాం. వారే నిర్ణయించుకుంటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తాయి."