సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి పూర్తిస్థాయిలో శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా భారత్ చైనా సైనికాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇరుదేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సైనిక ప్రతిష్టంభనను తొలగించడానికి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశాయి.
లద్దాఖ్‌లోని చుశూల్ ప్రాంతంలో ఈ భేటీ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దులో శాంతి నెలకొనే విధంగా ఇరుదేశాల సైనికాధికారులు తుది రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు.
తోక ముడిచిన డ్రాగన్
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించడం ప్రారంభించింది. భారత్ డిమాండ్ మేరకు... గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్, గల్వాన్ లోయలో పూర్తిగా బలగాలను ఉపసంహరించింది. పాంగొంగ్ సో ప్రాంతంలోని ఫింగర్-4 వద్ద సైన్యాన్ని గణనీయంగా తగ్గించింది. ఫింగర్-4, ఫింగర్-8 నుంచి బలగాలనూ పూర్తిగా వెనక్కి తరలించాలని భారత్ స్పష్టం చేస్తోంది.