ఒకే దేశం- ఒకే భాష అంటూ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అనేక ప్రాంతీయ పార్టీలు షా వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తాను వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు షా. మాతృభాష తర్వాత రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే అభ్యర్థించినట్టు ఆయన స్పష్టం చేశారు. హిందీయేతర రాష్ట్రమైన గుజరాత్ నుంచే తానూ వచ్చానని గుర్తు చేసిన షా.. ఈ అంశంపై రాజకీయాలు చేయాలని ఎవరైనా అనుకుంటే అది వారి ఇష్టమని పేర్కొన్నారు.
హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒకే దేశం-ఒకే భాష అనే విధానంతో హిందీ మాట్లాడాలని.. దీని ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని వ్యాఖ్యలు చేశారు షా.
"మాతృ భాష ద్వారానే పసి పిల్లల మానసికస్థితి పెరుగుతుంది. మాతృ భాషంటే హిందీ కాదు. ఆయా రాష్ట్రాల్లోని వారి ప్రాంతీయ భాషే మాతృభాష. కానీ దేశంలో ఒకే భాష ఉండాలి. ఎవరైనా మరో భాష నేర్చుకోవాలి అనుకుంటే అది హిందినే కావాలి. ఈ విషయమై నేను కేవలం అభ్యర్థించాను. దానిలో ఏం తప్పుందో అర్థం కావటం లేదు."
-అమిత్షా, కేంద్ర హోంమంత్రి
ప్రాంతీయ భాషలపై హిందీని బలవంతంగా రుద్దమని తాను ఎన్నడూ వ్యాఖ్యానించలేదని.. కావాలనే కొంతమంది ఈ అంశంపై రాజకీయం చేస్తున్నారని అమిత్ షా వెల్లడించారు.