జమ్ముకశ్మీర్ అంశానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని భారత్ వాదిస్తున్న వేళ పొరుగు దేశం నేపాల్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య విభేదాల పరిష్కారానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామని తెలిపింది. రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం సహజమే అన్న నేపాల్... చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడింది. అవసరమైతే ఇందుకు తాము మధ్యవర్తిత్వం వహించి క్రియాశీలక పాత్ర పోషిస్తామని తెలిపింది. ఇలా ప్రతిపాదన తెస్తూనే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలే ఉత్తమం అని కూడా నేపాల్ వ్యాఖ్యానించింది. ఉరీ ఉగ్రవాద దాడి తర్వాత నిలిచిపోయిన సార్క్ సదస్సు మళ్లీ జరగగలదని ఆకాంక్షించింది.
"శాంతియుత చర్చలే ఏ సమస్యకైనా పరిష్కారం. భేదాభిప్రాయాలు ఉండవచ్చు. అయితే సంప్రదింపుల ద్వారా వీటికి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. అవసరమైతే మేం మధ్యవర్తిత్వం చేస్తాం."