నిర్భయ అత్యాచారం కేసులో ఉరిశిక్షను తప్పించుకునేందుకు చివరి విడత ప్రయత్నాలను కొనసాగిస్తున్న దోషులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తాము క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసేందుకు అవసరమైన పత్రాలను తిహార్ జైలు అధికారులు అందించడం లేదని ఇద్దరు దోషులు అక్షయ్ కుమార్ సింగ్, పవన్ సింగ్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ కోర్టు పక్కన పెట్టింది. దీనిపై తదుపరి ఆదేశాలు ఉండవని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన దోషుల తరపు న్యాయవాది....దోషుల్లో ఒకరైన వినయ్ కుమార్‌పై క్రమంగా విషప్రయోగం చేస్తే.. ఆసుపత్రి పాలయ్యాడని, అయితే వైద్య నివేదికలు మాత్రం అతనికి అందజేయలేదని వివరించారు. ఇతర దోషుల అనారోగ్య సమస్యల వివరాలను వారికి అందజేయలేదని వాదించారు.
ఈ వాదనలను తిప్పికొట్టారు ప్రభుత్వ తరపు న్యాయవాది. అవసరమైన అన్ని పత్రాలను దోషులకు అందజేసినట్లు తెలిపారు. శిక్షను ఆలస్యం చేసేందుకు వారు ఇలా చేస్తున్నారని వివరించారు. అన్ని పత్రాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని, న్యాయస్థానం ఆదేశిస్తే వాటిని దోషులకు అందజేస్తామని తెలిపారు
సుప్రీంకోర్టు ఇటీవలే వినయ్, ముఖేష్ సింగ్ పిటిషన్లను కొట్టేసింది. ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించారు. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని దిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.
ఇదీ చూడండి: రూ.వెయ్యి కోట్ల విలువైన హెరాయిన్ ధ్వంసం