దేశంలో 30 కోట్ల మందికి టీకా అందించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగవంతమైన కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ డ్రైవ్ అవసరమన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.
శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కొవిడ్-19పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం 22వ భేటీలో ఈ మేరకు వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి. దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్క్ దాటిన రోజునే ఈ సమావేశం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.
"భారత్లో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి 2శాతానికి పడిపోయింది. మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.45 శాతంగా ఉంది. రికవరీ రేటు 95.46 శాతానికి చేరింది. టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించాలి. తొలి దశలో లక్ష్యంగా పెట్టుకున్న 30 కోట్ల మందికి పూర్తి స్థాయిలో అందించేందుకు వేగవంతమైన టీకా పంపిణీ వ్యవస్థ అవసరం. "