చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. తాజాగా నౌకాదళానికి చెందిన విమానాలను ఘర్షణ ప్రాంతాల వద్దకు రప్పిస్తోంది. జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనే అంశంలో త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం సాధించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నౌకాదళానికి చెందిన పి-8ఐ విమానాలను తూర్పు లద్దాఖ్‌లో ప్రభుత్వం మోహరించింది. అక్కడ చైనా బలగాల కదలికలపై నిఘా వేయడానికి వీటిని ఉపయోగించుకుంటోంది. 2017 సిక్కింలోని డోక్లామ్ వద్ద చైనా సైన్యంతో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, గత ఏడాది జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్ బలగాల కదలికలపై కన్నేసి ఉంచడానికి కూడా పి-8ఐలను భారత్ రంగంలోకి దించింది.
నౌకాదళానికే చెందిన కొన్ని మిగ్-29 యుద్ధవిమానాలను ఉత్తర ప్రాంతంలోని కీలక వైమానిక స్థావరాల్లో భారత్ మోహరించే అవకాశం ఉంది. మన నేవీ వద్ద ఈ తరగతి పోరాట విమానాలు దాదాపు 40 వరకూ ఉన్నాయి. వాటిలో 18 లోహవిహంగాలు విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై మోహరించాయి. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ, జాగ్వార్, మిరాజ్-2000 వంటి యుద్ధవిమానాలు ఇప్పటికే చైనాతో ఉన్న సరిహద్దుల్లో మన దేశం మోహరించింది. నౌకాదళ యుద్ధవిమానాలు కూడా రంగంలోకి దిగితే భారత దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది.
తూర్పు లద్దాఖ్‌కు రఫేల్!