నావికా దళానికి నిధులు మంజూరు క్రమక్రమంగా తగ్గుతోందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశం చైనా మాత్రం నావికా దళ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆయన గుర్తుచేశారు. 2012-13లో రక్షణ రంగం నుంచి నావికా దళానికి 18 శాతం నిధుల మంజూరు కాగా... 2018-19లో అది 13 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఈ సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.
"3 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు కల్గి ఉండడం నావికా దళ దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పటికే రెండు నౌకలు హిందూ మహా సముద్రంలో గస్తీ కాయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయంగా తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక 2022 నుంచి విధులు నిర్వర్తిస్తుంది. ఇది మిగ్- 29కే విమానాన్ని కల్గి ఉంటుంది" అని అడ్మిరల్ కరంబీర్ తెలిపారు. రెండవ దేశీయ విమాన వాహక నౌక.. 65 వేల టన్నుల కాటోబార్ విమాన క్యారియర్ అని, ఇది ఎలక్ట్రిక్ ప్రొపల్షన్‌తో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.