వ్యవసాయమైనా, వ్యాపారమైనా.. వారసులు అంటే కొడుకులని మనలో చాలామంది భావన. షాపులకు పేర్లు పెట్టినా 'అండ్ సన్స్', 'అండ్ బ్రదర్స్' అనే కనిపిస్తుంటాయి. కానీ పంజాబ్‌లోని లుథియానాలో ఓ మెడికల్ షాపు యజమాని మాత్రం కూతుళ్లే తన వారసులని తెలియజేసేలా పెట్టిన సైన్ బోర్డు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. 'గుప్తా అండ్ డాటర్స్' అంటూ ఆయన తన బిడ్డలకు ఇచ్చిన ప్రాముఖ్యతను నెటిజన్లు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
డాక్టర్ అమన్ కశ్యప్ అనే నెటిజన్ 'గుప్తా అండ్ డాటర్స్' పేరుతో ఉన్న సైన్‌బోర్డు చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. "కుమారుల పేర్ల మీద తెరిచిన షాపుల మాదిరిగా కాకుండా, గుప్తా అండ్ డాటర్స్ పేరుతో ఉన్న మెడికల్ షాపు సైన్‌బోర్డు లుథియానాలో కనిపించింది. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకున్న మార్పును చూడండి" అని రాసుకొచ్చారు. కొద్దిసేపట్లోనే ఆ ట్వీట్ వైరల్ అయింది. అంతేకాకుండా, ఆ తండ్రి ఆలోచనను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.
'కొత్త శకానికి ఆరంభం', 'వేరే పేరు చూడటం సంతోషంగా ఉంది' అని కొందరు కామెంట్ చేశారు. 'నా తండ్రికి కూడా నేను ఇదే చెప్పాను. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు దీన్ని చూపిస్తాను' అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.