ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర రాజధాని ముంబయి పూర్తిగా నీటమునిగింది. బుధవారం కురిసిన భారీ వానకు రోడ్లు, వీధుల్లో వరద నీరు పొంగి పొర్లుతోంది. రవాణా స్థంభించింది. చెట్లు, విద్యుత్ స్థంభాలు కూలిపడ్డాయి. ఇళ్లు, దుకాణలు జలమయమయ్యాయి.
దక్షిణ ముంబయిలోని కొలాబా అబ్జర్వేటరీలో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు 293 మిమీల వర్షపాతం నమోదైంది. అయితే, ఆ తర్వాత మేఘాల సాంద్రత కాస్త తగ్గిందని, కాబట్టి గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది భారత వాతారవణ శాఖ.
"డాప్లర్ వాతావరణ సూచీ ప్రకారం ముంబయి పరిసర ప్రాంతాల్లో మేఘాల సాంద్రత కాస్త తగ్గింది. ముంబయి, థానే, పాల్ఘర్, ఉత్తర కొంకణ్ ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం నుంచి వర్షపాతం తగ్గుతుందని అంచనా."