పాల కేంద్రాల్లో సర్కార్ చికెన్ వ్యాపారం పాల కేంద్రాల్లో కడక్‌నాథ్ కోడి మాంసం, గుడ్లు అమ్మేలా నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కార్. రాష్ట్ర పశు, పౌల్ట్రీ కోఆపరేషన్ ఆధ్వర్యంలో నడిచే భోపాల్‌లోని ఓ పాలకేంద్రంలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ కేంద్రాలను నడపాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం కడక్‌నాథ్ చికెన్ ధర మార్కెట్లో కిలో రూ.900గా ఉంది.
ఈ కోడి మాంసంలో ఆరోగ్యకరమైన అత్యధిక పోషక విలువలు ఉండటం వల్ల బాగా డిమాండ్ ఉంది.
"కడక్‌నాథ్ కోడి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయోగాత్మకంగా భోపాల్‌లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చర్చిస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన ఈ కేంద్రాలను ఇంకా విస్తరిస్తాం."
- లఖన్ సింగ్, రాష్ట్ర పశు సంవర్థక మంత్రి
భాజపా ఆగ్రహం...
ఈ నిర్ణయంపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది.
"ఆవు పాలు, కడక్‌నాథ్ మాంసం ఒకే కేంద్రంలో అమ్మడానికి వీల్లేదు. ఇది మత విశ్వాసాలను దెబ్బతీసినట్లే. ఆవు పాలను స్వచ్ఛంగా భావించి.. పూజాధికాలకు వినియోగిస్తారు. ఉపవాస దీక్షలకు వాడతారు. రెండింటికీ వేర్వేరు పార్లర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."
- రమేశ్ శర్మ, భాజపా ఎమ్మెల్యే
భాజపా విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చింది. కేంద్రం ఒక్కటే ఉన్నప్పటికీ పాలు, మాంసం నిల్వ, విక్రయాలకు వేర్వేరు కేబిన్లు ఉంటాయని స్పష్టం చేసింది.
2018 ఆగస్టులో కడక్‌నాథ్ మాంసంపై మధ్యప్రదేశ్ జబువా జిల్లా భౌగౌళిక సూచిక (జీఐ) ట్యాగ్ సాధించింది. ఇక్కడ నుంచే ఈ మాంసం సరఫరా అవుతుంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య కడక్‌నాథ్ కోళ్ల మూలాల హక్కులపై ఎన్నో ఏళ్లు పోరాటం నడిచింది.