కేంద్రం-బంగాల్ ప్రభుత్వం మధ్య వైరం మరింత తీవ్రరూపు దాల్చింది. ఆదివారం రాత్రి మొదలైన హైడ్రామా గంటగంటకు కీలక మలుపులు తిరుగుతోంది.
శారద కుంభకోణంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల బృందం ఆదివారం అక్కడికి వెళ్లింది. సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసుల మధ్య వాదనలు జరిగి, సీబీఐ అధికారులను బలవంతంగా సమీపంలోని స్టేషన్‌కు తరలించారు కోల్‌కతా పోలీసులు. తర్వాత కాసేపటికి విడిచిపెట్టారు.
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సత్యాగ్రహం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కోల్‌కతాలోని మెట్రా ఛానల్ వద్ద రాత్రి దీక్షకు దిగారు మమత. ఆమెకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి.
బంగాల్ వివాదం-తాజా పరిణామాలు...
- 2:15PM:- ఉభయసభలు రేపటికి వాయిదా. బంగాల్ వివాదంపై ఇరు సభల్లో గందరగోళం.
- 1:20PM:- డార్జిలింగ్‌లో గూర్ఖా జనముక్తి మోర్చా ర్యాలీ. ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మద్దతు.
- 1:15PM:- ఎన్నికల సంఘాన్ని కలిసిన భాజపా బృందం. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చర్యలపై ఈసీకి ఫిర్యాదు. రాష్ట్రంలో భాజపా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని ఆరోపణ. ప్రజాస్వామ్యంపై ఆ పార్టీకి విశ్వాసం లేదని విమర్శ.
- 12:30PM:-బంగాల్ వివాదంపై లోక్‌సభలో వాడీవేడి చర్చ. కేంద్రం తీరును తప్పుబట్టిన విపక్షాలు. దీటుగా తిప్పికొట్టిన కేంద్ర హోంమంత్రి. సభ్యుల నిరసనలతో మధ్యాహ్నం 2గంటల వరకు లోక్‌సభ వాయిదా.
- 12:25PM:-దీక్ష కొనసాగిస్తున్న పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.
- 12PM:-రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసనలు. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ నినాదాలు. మధ్యహ్నం 2 గంటల వరకు ఎగువ సభ వాయిదా.
- 11:50AM :-బంగాల్ వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడి స్పందన. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆరోపణ. ఎన్నికలు సమీపిస్తుండగా కేంద్రం సీబీఐను దుర్వినియోగం చేస్తోందని విమర్శ.
- 11:45AM:-పశ్చిమబంగ గవర్నర్‌తో రాజ్‌నాథ్ సంభాషణ. కోల్‌కతాలో తాజా పరిస్థితులపై ఆరా. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన.
- 11:45AM:- లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యుల ఆందోళన. బంగాల్ వివాదంపై నిరసనలు. కాసేపు వాయిదాపడ్డ దిగువసభ.
- 11AM:-సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీబీఐ. చిట్‌ఫండ్ కుంభకోణంలో విచారణకు రాజీవ్ కుమార్ సహకరించేలా ఆదేశించాలని అభ్యర్థన. రేపు విచారణ చేపట్టనున్న అత్యున్నత ధర్మాసనం.
- 10:30 AM:- ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించనున్న భాజపా. బంగాల్ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం. భాజపా ప్రతినిధుల బృందంలో నిర్మలా సీతారామన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, భూపేంద్ర యాదవ్.