సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అందించినందుకు వారణాసి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములకు అతీతంగా కాశీవాసులు సార్వత్రిక ఎన్నికలను ఒక పండుగలా జరుపుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.
వారణాసిలో భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. పార్టీ శ్రేణుల కఠోర శ్రమ వల్లే విజయం సాధించగలిగానని ప్రశంసించారు. పార్టీ కార్యకర్తల సంతోషమే తన జీవనమంత్రమని ప్రధాని స్పష్టం చేశారు.
"నామినేషన్ దాఖలు చేయడానికి ఒక నెల ముందు ఇక్కడకి వచ్చినప్పుడు కాశీ ఒక విశ్వరూపంలా కనపడింది. ఇది కేవలం వారణాసినే ప్రభావితం చేయలేదు. యావత్ భారతదేశాన్ని ప్రభావితం చేసింది. నామపత్రం దాఖలు చేశాక ఇక్కడ ప్రజలను, కార్యకర్తలను కలిసే అవకాశం లభించింది. ఒక నెల వరకు కాశీకి రాకూడదని కార్యకర్తలు నన్ను ఆదేశించారు. దేశ ప్రజలు నన్ను ప్రధానిని చేసినా... మీకు మాత్రం నేను కార్యకర్తనే. మీ ఆదేశాలే నాకు ఎంతో ముఖ్యం. ప్రచారాలు, ఎన్నికల సమయంలో నేను ఉన్నంత నిశ్చింతగా మరెవరూ లేరేమో. ఈ నిశ్చింతకు కారణం మోదీ కాదు. మీ కఠోర శ్రమే ఇందుకు కారణం."
--- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి